Display:
సంకీర్తన
తాళ్లపాక వేంకటశేషాచార్యుల
వ్రాతప్రతి పుట: 52 సంకీర్తన: 51
ప్రత్యేక సంపుటము - సంకీర్తన: 194
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: శంకరాభరణం - అట
పొడగంటిమయ్య మిమ్ము పురుషోత్తమా, మమ్ము
నెడయకవయ్య కోనేటిరాయఁడా
॥పల్లవి॥
కోరి మమ్ము నేలినట్టి కులదైవమా, చాల
నేరిచి పెద్దలిచ్చిన నిధానమా
గారవించి దప్పిదీర్చు కాలమేఘమా, మాకు
చేరువఁ జిత్తములోని శ్రీనివాసుఁడా
॥పొడగంటి॥
భావింపఁ గైవసమైన పారిజాతమా, మమ్ము
చేవదేరఁ గాచినట్టి చింతామణీ
కావించి కోరిక లిచ్చే కామధేనువా, మమ్ము
తావై రక్షించేటి ధరణీధరా
॥పొడగంటి॥
చెడనీక బ్రదికించే సిద్ధమంత్రమా, రోగా
లడఁచి రక్షించే దివ్యౌషధమా
బడిఁబాయక తిరిగే ప్రాణబంధుఁడా, మమ్ము
గడియించినట్టి శ్రీవేంకటనాథుఁడా
॥పొడగంటి॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము