సంకీర్తన
తాళ్లపాక వేంకటశేషాచార్యుల
వ్రాతప్రతి పుట: 213 సంకీర్తన: 224
ప్రత్యేక సంపుటము - సంకీర్తన: 197
తాళ్లపాక వేంకటశేషాచార్యుల
వ్రాతప్రతి పుట: 213 సంకీర్తన: 224
ప్రత్యేక సంపుటము - సంకీర్తన: 197
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: లుప్తము
పొలతి జవ్వనముపైఁ - బుయ్యకపూచె యీ తలఁపు[1] దెలియలే (రీతరి) యిం - దుల కేమి[2] సేతామె | ॥పల్లవి॥ |
సతి చి(ంతా )లతలను - సంపెంగ పువ్వులే (పూచె)[3] మతి విరహము మేన - మల్లెలు పూచె అతని నా తలపోఁత[4] - నడవి జాజులుపూచె యీతరి దెలియలే - రిందుల[5] కేమి సేతామె | ॥పొలతి॥ |
తొయ్యలి చెమట నీట - దొంతి తామెరలెపూచె కొయ్యచూపు నటనలఁ[6] - గుంకుమపూచె కయ్యపు వలపులఁ జీఁ - కటిమాకులేపూచె యియ్యెడ దెలియ - రిందుల కేమి[7] సేతామె | ॥పొలతి॥ |
మగువరతుల నిట[8] - మంకెన పువ్వులేపూచె మొగిఁ గొనగోళ్లనే - మొగలిపూచె పొగడు[9] శ్రీవేంకటేశు - పొందులఁ గ్రోవి[10] పూచె యిగురుబోణులార - యిందుల కేమిసేతామె | ॥పొలతి॥ |
(ఈ సంకీర్తన 24వ సంపుటంలో 8వ సంకీర్తనగా ఉంది.)
[1] పొలిఁతి జవ్వనమునఁ బూవకపూచె (ముద్రిత పాఠము)
[2] యెలమి విందుకు మనమేమి (ముద్రిత పాఠము)
[3] (పూచె) వ్రాతప్రతిలో లుప్తము
[4] అతనుని తలఁపోఁత (ముద్రిత పాఠము)
[5] హితవు దెలియదిక (ముద్రిత పాఠము)
[6] కొయ్యచూపుఁ గోపముల (ముద్రిత పాఠము)
[7] నియ్యెడఁ జెలియ భావమేమి (ముద్రిత పాఠము)
[8] లోన (ముద్రిత పాఠము)
[9] పొగరు (ముద్రిత పాఠము)
[10] గప్రము (ముద్రిత పాఠము)