Display:
సంకీర్తన
తాళ్లపాక వేంకటశేషాచార్యుల
వ్రాతప్రతి పుట: 255 సంకీర్తన: 269
ప్రత్యేక సంపుటము - సంకీర్తన: 198
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: సౌరాష్ట్ర
పొలతి మా చెలి యనుచు - బొగడే మిపుడు నీ
తలపులో లెస్సగా - తలపోసి చూడు
॥పల్లవి॥
కోడె జక్కవలు మా - కొమ్మ పాలిండ్లతో
యీ డనగవచ్చు; నొక - యింత కడమ!
కూడి వీడుట వాని - గుణము; వీనికి నెపుడు
కూడుటలే కాని మరి - వీడుటలు లేవు
॥పొలతి॥
గొనబు బేడిసలు మా - కోమలి కనులతో
నెనయంగ వచ్చు; నొక - యింత కడమ!
జునిగి పెనగుట వాని - సూటి; వీనికి నెపుడు
జునుగుటలే కాని మరి - పొనుగుటలు లేవు
॥పొలతి॥
యెలమి వేంకటపతి - (యీ) కలకంఠితో
నిల జోడనగ వచ్చు (నొక) - యింత కడమ!
బలిసి పొలియుట వాని - బాగు; (పొలతి)కి నెపుడు
బలియుటలే కాని - పొలియుటలు లేవు
॥పొలతి॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము