Display:
సంకీర్తన
తాళ్లపాక వేంకటశేషాచార్యుల
వ్రాతప్రతి పుట: 84 సంకీర్తన: 84
ప్రత్యేక సంపుటము - సంకీర్తన: 200
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: ఘంటారవము
పోఁబొయ్యే పడుచ! - వుండవే మాట చెప్పేను
పో వోయి వగకాఁడ! నీకు - పొద్దుపోక తిరిగేవు
॥పల్లవి॥
తలమీద తుమ్మెదలున్నవి ద - గ్గర వచ్చిన రేఁచీనే
తెలియగ కురులింతె గాని - తేటిగములు కావోయి
చలమున పయ్యెదలోపల - జక్కవలనే బెట్టేవే
బలిమిగల నా గుబ్బలింతె గాని - పక్షులు గావోయి
॥పోఁబొయ్యే॥
పదనైన నీ యధరాన దొండ - పండున్నది నాకియ్యవే
పెదవింతే కాని నా - యధరానను బింబఫలము గాదోయి
వదరకువే నీ మేను కుందనము - బంగారొరసి నే జూచేనే
పొదలిన నా మేనింతె కాని - పుత్తడి గాదోయి
॥పోఁబొయ్యే॥
నిచ్చలమగు నీ చెక్కుటద్దముల - నీడలు నే జూచేనే
మెచ్చుగ నా చెక్కులింతే గాని - మెఱుగుబిళ్లలు గావోయి
అచ్చుగ శ్రీవేంకటనాథుడనై - అతివ నిన్ను గూడితిని
ముచ్చట దీరెను మొగి నిల - మ్రొక్కే నీకు పోవోయి
॥పోఁబొయ్యే॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము