Display:
సంకీర్తన
తాళ్లపాక వేంకటశేషాచార్యుల
వ్రాతప్రతి పుట: 136 సంకీర్తన: 138
ప్రత్యేక సంపుటము - సంకీర్తన: 209
తాళ్లపాక పెదతిరుమలాచార్య
రాగము: కాంబోది
మగువలు చూడరమ్మా మరుఁడు సేసినమాయ
యిగిరించెఁ జక్కఁదన మేమి చెప్పేదే
॥పల్లవి॥
కందులేని చందురులోఁ గలువరేకులు వుట్టె
అందులోనే మల్లెదండ లవి మించెను
కందువఁ గమ్మర నవే కాయజునియమ్ము లాయ
యిందుముఖిచెలు వింక నేమి చెప్పేదే
॥మగువలు॥
ఆకసముమీఁదఁ గొండ లాదరువు లేక పుట్టె
ఆకడ నాపొంతఁ దీగె లవి మించెను
కైకొని యా తుదలనే కమలము లుదయించే
యీకాంత భావ మిది యేమి చెప్పేదే
॥మగువలు॥
పాయపుమెఱుఁగు దీగెఁ బగడపు బండు వండె
చాయ శ్రీవేంకటపతి చవిగొనెను
మోయుచు నిద్దరిలోన ముత్యాలవాన వుట్టే
యీయతివసొబ గింక నేమి చెప్పేదే
॥మగువలు॥

(ఈ సంకీర్తన 17వ సంపుటంలో 514వ సంకీర్తనగా ఉంది.)

AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము