Display:
సంకీర్తన
తాళ్లపాక వేంకటశేషాచార్యుల
వ్రాతప్రతి పుట: 152 సంకీర్తన: 155
ప్రత్యేక సంపుటము - సంకీర్తన: 213
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: సామంతం[1]
మదము దొలఁకెడి యట్టి మంచి వయసున మనకు
తుదలేని వేడుకలు దొరకుటెన్నఁడురా
॥పల్లవి॥
ఉదుటుఁ జనుదోయి నీవురముపైఁ దనివార-
నదిమి మోమును మోము నలమి యలమి
వదలైన నీవితో వాలుఁగన్నుల జంకె-
లొదవ నీ మీఁద నే నొరగుటెన్నఁడురా
॥మదము॥
కలికితనమునఁ నాదు కప్పురపుఁ దమ్ములము
కులికి నీ వదమునఁ గుమ్మరించి
పలచనగు గోళ్ల నీ పగడవాతెర నొక్కి
చెలువమగు నునుగంటి సేయుటెన్నఁడురా
॥మదము॥
గరగరని కురులతో కస్తూరివాసనలు
విరితావులతోడ విసరఁగాను
తిరువేంకటాచలాధిపుఁడ నినుఁ గూడి నే-
నరమరచి సదమదములౌట[2] యెన్నఁడురా
॥మదము॥

(ఈ సంకీర్తన 5వ సంపుటంలో 54వ సంకీర్తనగా ఉంది.)

[1] తంజావూరి ప్రతి. కాంభోజి, జంపె తాళం
[2] తంజావూరి ప్రతి. సదమదంబౌట
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము