Display:
సంకీర్తన
తాళ్లపాక వేంకటశేషాచార్యుల
వ్రాతప్రతి పుట: 3 సంకీర్తన: 1
ప్రత్యేక సంపుటము - సంకీర్తన: 214
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: లుప్తము
[1](మదిలో మెదలెడి పతికిని - యెదలో నొదిగిన సతివై
ముద మొందుచు కలికీ! స-మ్మోదము గూర్తువుగా)
॥పల్లవి॥[2]
చలమున నేరాయని యర - జారిన పయ్యెదతోడను
తొలఁగక యెదపై నొరగుచుఁ - దుందుడు కారఁగను
చిలుకకు బింబము నిచ్చే - చెలుపున నీ యధరమ్మును
తలఁపునఁ దమిఁ [3]జనులొత్తుచు - దయతో నిత్తువుగా
॥మదిలో॥
కొసరినను నేరా యని - కూరిమి దైవారగను
ముసిముసి నగవుల వెన్నెల - మోమునఁ గాయఁగను
వొసపరి కోయిలకును చిగు- రొసగిన వడి దోపగను
పసగల వీడెపు మడుపులు - పైకొని యిత్తువుగా
॥మదిలో॥
చనవున వెంకటపతి కను - [4]చెనకిన నేరా యనినను
మనమున మచ్చిక బాగులు - మమతల విరిగొనగా
గొనబౌ [5]జక్కవ పిట్టకు - కోరిక [6]నకరువు లిడు క్రియ
ననవిల్తుని [7]కజ్జాయము - నయమున నిత్తువుగా
॥మదిలో॥

[1] బ్రాకెట్లలోని అంశములు వ్రాతప్రతిలో లుప్తములు
[2] లుప్తము
[3] తమి ససు లొత్తుచు (వ్రాతప్రతి)
[4] కనుచెకిన (వ్రాతప్రతి)
[5] పొజ్జక్కన పిట్ట (వ్రాతప్రతి)
[6] నకరవువిడు (వ్రాతప్రతి)
[7] కెంజాయము (వ్రాతప్రతి)
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము