Display:
సంకీర్తన
తాళ్లపాక వేంకటశేషాచార్యుల
వ్రాతప్రతి పుట: 27 సంకీర్తన: 25
ప్రత్యేక సంపుటము - సంకీర్తన: 217
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: శ్రీరాగం
మనములోని విభుఁడు మఱవఁడే కాలంబు
నినుఁగలయనున్నాఁడు నీకేలె వెఱవ
॥పల్లవి॥
నెలనాళ్లవాఁడొకఁడు నిర్మలంబైన రె
న్నెలలవాఁడొకఁడు మూన్నెలలవాఁడొకఁడు
నెలలు పండ్రెండైన నిజబాలుఁడొక్కండు
నెలఁత యింతటి పనికె నీకేలె వెఱవ
॥మనము॥
ప్రొద్దుపొడుపుల దొకటి ప్రొద్దు గ్రుంకుల దొకటి
ప్రొద్దువ్రొద్దులకు రహిపొయ్యేటి దొకటి
పొద్దెఱింగిన దొకటి పొద్దెఱుంగని దొకటి
నిద్దంపుఁ బువ్వులకు నీకేలె వెఱవ
॥మనము॥
నిండుఁ జంచల మొకటి నిమిషమాత్రము దొకటి
వుండి నట్లనె వుండి వుడి వోవునొకటి
కొండలలో నెలకొన్న కోనేటిరాయండు నీ
నిండుఁ గౌఁగిటఁ గూడె నీ కేలె వెఱవ
॥మనము॥

(ఈ సంకీర్తన 6వ సంపుటంలో 57వ సంకీర్తనగా ఉంది.)

AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము