Display:
సంకీర్తన
తాళ్లపాక వేంకటశేషాచార్యుల
వ్రాతప్రతి పుట: 218 సంకీర్తన: 229
ప్రత్యేక సంపుటము - సంకీర్తన: 225
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: శంకరాభరణం
మొల్లలేలె నాకు తన్నె ముడుచుకొమ్మనవె నేఁ
జెల్ల పూవు కొప్పుతావి చెంచుదానను
॥పల్లవి॥
పట్టుచీ రేఁటికి నాకు పారిటాకులె చాలు
దట్టిగట్టుకొమ్మనవే తనమొలనే
పట్టెమంచ మేలె నాకు పవ్వళించు మనవె నేఁ
జెట్టుకిందఁ బొరలాడే చెంచుదానను
॥మొల్లలేలె॥
సందిదండ లేలె నాకు సంకుఁగడియమె చాలు
యిందవే యెవ్వతెకైన నిమ్మనవె
గందమేలె నాకు చక్కని తనకే కాక నేఁ
జిందువందు చెమట మై చెంచుదానను
॥మొల్లలేలె॥
కుచ్చుముత్యాలేలె నాకు గురివిందలె చాలు
కుచ్చి తనమెడఁ గట్టి కొమ్మనవె
కచ్చుపెట్టి కూడె వేంకటగిరీంద్రుఁడు నను
చిచ్చినే నడవిలో చెంచుదాననూ
॥మొల్లలేలె॥

(ఈ సంకీర్తన 6వ సంపుటంలో 108వ సంకీర్తనగా ఉంది.)

AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము