అధ్యాత్మ సంకీర్తన
రేకు: 331-1
సంపుటము: 4-178
రేకు: 331-1
సంపుటము: 4-178
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: ఆందోళి
కన్నులపండుగలాయఁ గన్నవారి కిందరికి వెన్నుఁ డేఁగీ నిల్లిదివో వీధుల వీధులను | ॥పల్లవి॥ |
అదె యెక్కెఁ దిరుతేరు అసురలు బెదరఁగ త్రిదశులు చెలఁగఁగ దేవదేవుఁడు కదలె బండికండ్లు ఘనమైన మ్రోఁతతోడ వెదచల్లుఁ గాంతులతో వీధుల వీధులను | ॥కన్ను॥ |
తోలి యాడీఁ దిరుతేరు దుష్టులెల్ల నణఁగఁగ చాలుకొని శిష్టులెల్ల జయవెట్టఁగ గాలికిఁ బడగలెల్లాఁ గడు నల్లాడఁగఁ జొచ్చె వేలేటి పువుదండలతో వీధుల వీధులను | ॥కన్ను॥ |
తావు చేరెఁ దిరుతేరు ధర్మములు నిలువఁగ యీవల నలమేల్మంగ ఇచ్చగించఁగా శ్రీవేంకటేశ్వరుఁడు శింగారాలు మెరసెను వేవేలు విధముల వీధుల వీధులను | ॥కన్ను॥ |