Display:
అధ్యాత్మ సంకీర్తన
రేకు: 374-3
సంపుటము: 4-434
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: శోకవరాళి
నడవరో జడియక నవ్యమార్గ మిది
మడుఁగిది వైష్ణవమార్గ మిది
॥పల్లవి॥
ఘనశుకముఖ్యులు గన్న మార్గ మిది
జనకాదులు నిశ్చలమార్గ మిది
సనత్కుమాఁరుడుజరపుమార్గ మిది
మనువుల వైష్ణవమార్గ మిది
॥నడవ॥
నలుగడ వసిష్ఠు నడుచు మార్గమిది
యిల వేదవ్యాసుల మార్గం బిది
బలిమిగలుగు ధ్రువ పట్టపు మార్గము
మలసిన వైష్ణవ మార్గ మిది
॥నడవ॥
పరమమార్గం బిదె ప్రపంచమార్గము
గురుమార్గం బిదె గోప్య మిదే
గరిమెల శ్రీ వేంకటపతి మాకును
మరిపెను వైష్ణవమార్గ మిదే
॥నడవ॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము