Display:
అధ్యాత్మ సంకీర్తన
రేకు: 374-5
సంపుటము: 4-436
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: బౌళి
వెదకిన నిదియే వేదాంతార్థము
మొదలు తుదలు హరిమూలంబు
॥పల్లవి॥
మునుకొని అవయవములు యెన్నైనా
పనివడి శిరసే ప్రధానము
యెనలేని సురలు యెందరు గలిగిన
మునుపటి హరియే మూలంబు
॥వెదకి॥
మోవని యింద్రియములు యెన్నైనా
భావపు మనసే ప్రధానము
యీవల మతములు యెన్ని గలిగినా
మూవురలో హరి మూలంబు
॥వెదకి॥
యెరవగు గుణములు యెన్ని గలిగినా
పరమ జ్ఞానము ప్రధానము
యిరవుగ శ్రీ వేంకటేశ్వరు నామమే
సరవి మంత్రముల సారంబు
॥వెదకి॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము