Display:
అధ్యాత్మ సంకీర్తన
రేకు: 375-1
సంపుటము: 4-437
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: బౌళి
ఎప్పటి జీవుఁడే యెప్పటి జగమే యెంతగాలమును నీ రీతే
కప్పుక వచ్చితి వనాదినుండియు కర్మమ యింకా వేసరవా
॥పల్లవి॥
మఱచితివా తొలుజన్మంబుల మరణకాలములదుఃఖపుబాట్లు
మఱచితివా యమకింకరులయి మర్దించిన బహుతాడనలు
మఱచితివా నరకకూపముల మాఁటికి మాఁటికిఁ బరచిన బాధలు
మఱియును సుఖమని భవమే కోరెదు మనసా ముందరగానవుగా
॥ఎప్పటి॥
తలఁచవుగా జననకాలమునఁదనువిదియే యిటుపుట్టిన రోఁతలు
తలఁచవుగా బాల్యంబునఁ దల్లితండ్రుల శిక్షలు వ్యాథులును
తలఁచవుగా సంసారమునకును దైన్యంబును యాచించెటి యలమట
తలఁపుననిదియే వలెనని వోమెదు తనువా యింకా రోయవుగా
॥ఎప్పటి॥
కంటివిగా మలమూత్రాదుల కడుగఁగఁ దీరని దినదినగండము
కంటివిగా కనురెప్పలనే కాలముగడచేటికడత్రోవ
కంటివిగా శ్రీవేంకటపతి కరుణచేత నీ వివేకభావము
అంటి యిటువలెనె సార్వకాలమును అంతరాత్మ నినుఁదలఁచగా
॥ఎపటి॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము