Display:
అధ్యాత్మ సంకీర్తన
రేకు: 375-2
సంపుటము: 4-438
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: లలిత
అన్నిమంత్రములు నిందే యావహించెను
వెన్నతో నాకుఁ గలిగె వేంకటేశు మంత్రము
॥పల్లవి॥
నారదుండు జపియించె నారాయణ మంత్రము
చేరెఁ బ్రహ్లాదుఁడు నారసింహ మంత్రము
కోరి విభీషణుఁడు చేకొనె రామమంత్రము
వేరె నాకుఁగలిగె వేంకటేశు మంత్రము
॥అన్ని॥
రంగగు వాసుదేవ మంత్రము ధ్రువుఁడు జపించె
నంగవించెఁ గృష్ణమంత్ర మర్జునుఁడును
ముంగిట విష్ణుమంత్రము మొగి శుకుఁడు పఠించె
వింగడమై నాకు నబ్బె వేంకటేశు మంత్రము
॥అన్ని॥
యిన్ని మంత్రములకెల్ల యిందిరా నాథుఁడే గురి
పన్నినదిదియే పర బ్రహ్మమంత్రము
నన్నుఁ గావఁ కలిగెఁబో నాకు గురుఁడియ్యఁగాను
వెన్నెలవంటిది శ్రీ వేంకటేశు మంత్రము
॥అన్ని॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము