శృంగార సంకీర్తన
రేకు: 14-4
సంపుటము: 5-82
రేకు: 14-4
సంపుటము: 5-82
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: నాదరామక్రియ
ఏమొకొ చిగురుటధరమున యెడనెడఁ గస్తురి నిండెను భామిని విభుఁనకు వ్రాసిన పత్రిక కాదుగదా | ॥పల్లవి॥ |
కలికి చకోరాక్షికిఁ గడకన్నులు గెంపై తోఁచిన చెలువంబిప్పుడిదేమో చింతింపరె చెలులు నలువున బ్రాణేశ్వరుపై నాటిన యాకొన చూపులు నిలువునఁ బెరుకఁగ నంటిన నెత్తురు గాదు గదా | ॥ఏమొ॥ |
పడఁతికి చనుఁగవ మెఱుఁగులు పైపై బయ్యెద వెలుపల కడు మించిన విధమేమో కనుఁగొనరే చెలులు ఉడుగని వేడుకతోఁ బ్రియుఁడొత్తిన నఖ శశి రేఖలు వెడలఁగ వేసవికాలపు వెన్నెల గాదు గదా | ॥ఏమొ॥ |
ముద్ధియ చెక్కుల కెలఁకుల ముత్యపు జల్లుల చేర్పుల వొద్దికలాగు లివేమో వూహింపరె చెలులు గద్దరి తిరువేంకటపతి కామిని వదనాంబుజమున అద్దిన సురతపుఁ జెమటల అందము గాదు గదా | ॥ఏమొ॥ |