Display:
శృంగార సంకీర్తన
రేకు: 15-2
సంపుటము: 5-86
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: తెలుఁగుఁగాంబోది
చెట్ట వట్టేవేరా నన్నుఁ జెంచుదానిని
పుట్టతేనెలారగించి పోక వుండేవా
॥పల్లవి॥
కుదురు గదలని నాగుబ్బలే చూచితి గాని
గదరుఁ బుణుఁగు కంపు గానవైతివిగా
చిదిమినా నెఱఁగవు చేరేవు నా పొగడని
గుదికొన్నమరునమ్ము గుండె దాఁకెనా
॥చెట్ట॥
తొరంపు నా మెఱుఁగుల తొడలే చూచితి గాని
జీరల నాచెమటమై చిత్తగించవా
కేరేవు నా పొడగని కిందుపడి నీవు నాకు
యీరాని చనవులెల్లా నియ్యనోపుదా
॥చెట్ట॥
పిక్కటిల్లు తేనెల నా పెదవే చూచితి గాని
చొక్కపు నా యెంగిలిని చూడవైతిగా
ఇక్కువ గరఁగి వేంకటేశ నన్నుఁ గూడితివి
వొక్కనిమిషమోరవ నోపవైతిగా
॥చెట్ట॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము