శృంగార సంకీర్తన
రేకు: 22-4
సంపుటము: 5-123
రేకు: 22-4
సంపుటము: 5-123
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: ఆహిరి
అన్ని జాతులు దానెయై వున్నది కన్నులకలికి మాయగరచెనో యనఁగ | ॥పల్లవి॥ |
కన్నె శంకిణిజాతి గాఁబోలు వీఁపునను సన్నపు మదనాంకములు జడి గొన్నవి వన్నెలుగ వలరాజు వలపు తలకెక్కించ పన్నినటువంటి సోపానములో యనఁగా | ॥అన్ని॥ |
తెఱవ దలపోయ చిత్తిణిజాతి గాఁబోలు నెఱులు విచ్చుచు వీధి నిలుచున్నది నెఱతనము మరుఁడు తను నిండవేసిన యంప- గరులిన్ని యనుచు లెక్కలు వెట్టుగతిని | ॥అన్ని॥ |
కాంత హస్తిణిజాతి గాఁబోలు కరమూలము- లంతకంతకు నలుపులై యున్నవి పంతంపుమరుఁడు తన భండారమిండ్లకును దొంతిగా నిడిన కస్తూరి ముద్రలనఁగా | ॥అన్ని॥ |
ఘనత పద్మిణిజాతి గాఁబోలు నీలలన తనువెల్ల పద్మగంధంబైనది మినుకుగా మరుఁడు తామెరలమ్ములనె మేను కనలించి వడిఁ బువ్వుగట్టెనో యనఁగా | ॥అన్ని॥ |
ఇదియు జగదేక మోహిణి దానె కాఁబోలు కదలు కనుఁగవకెంపు గలిగున్నది వదలకిటు వేంకటేశ్వరుని కుంకుమపూఁత చెదరి చెలికనుఁగొనలఁ జిందెనోయనఁగా | ॥అన్ని॥ |