Display:
శృంగార సంకీర్తన
రేకు: 22-5
సంపుటము: 5-124
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: ఆహిరి
కెరలి బయట దాఁగీ వీఁడు తన-
వొరపులు చూపుచు నొరగీ వీఁడు
॥పల్లవి॥
కొమ్మ చూడవే కొలిమిగూటిలో-
నమ్మెడి సూదులె యదె వీఁడు
ఎమ్మెలు నెరపుచు నెక్కడఁ దిరిగో
నమ్మికబొంకుల నను సొలసీని
॥కెరలి॥
నాఁతిరో చూడవే నవ్వుచు మీలకు-
నీఁతలు గరపీనిదె వీఁడు
కాఁతాళంబునఁ గనలెడి నాపై
చేఁతలు సేసిఁ జెలఁగుచుఁ దాను
॥కెరలి॥
అల్లనె చూడవె అడవిమృగములకుఁ
బల్లము వేసీఁ బైవీఁడు
వొల్లని ననునిదె వుల్లమి చేకొనెఁ
గల్లరి తిరువేంకటపతి వీఁడు
॥కెరలి॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము