Display:
అధ్యాత్మ సంకీర్తన
రేకు: 4-4
సంపుటము: 1-24
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: ఆహిరి
వననిధిఁ గురిసిన వానలివి మతి-
పనిలేని పనుల భారములు
॥వననిధి॥
అడవుల వెన్నెల లారిడిబదుకులు
తడతాఁకుల పరితాపములు
వొడలొసఁగిన హరి నొల్లక యితరుల
బడిబడిఁ దిరిగిన బంధములు
॥వననిధి॥
కొండల నునుపులు కొనకొన మమతలు
అండలఁ కేగిన నదవదలు
పండిన పంటలు పరమాత్ము విడిచి
బండయి తిరిగిన బడలికలు
॥వననిధి॥
బచ్చన రూపులు పచ్చల కొలపులు
నిచ్చల నిచ్చల నెయ్యములు
రచ్చల వేంకటరమణునిఁ గొలువక
చచ్చియుఁ జావని జన్మములు
॥వననిధి॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము