Display:
శృంగార సంకీర్తన
రేకు: 91-1
సంపుటము: 5-356
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: ఆహిరి
ఇంతి చేసిన భాగ్యమిట్లుండె దైవకృత-
మింతయును గడపంగ నెవ్వరికి రాదు
॥పల్లవి॥
విరహవేదనచేత వేఁగెడి విలాసినుల
సొరిది నింతకు మున్ను చూడమో వినమో
అరుదైన దుస్తరంబై ధరించఁగరాని-
దురవస్థలెవ్వరికి దొరకవనికాక
॥ఇంతి॥
తల దోఁకలేని చిత్తమున వలపులఁ బొరలు-
పొలఁతులింతకుమున్ను పుట్టరో చనరో
అలవోక తెలుపులును అబ్బురపు మరపులును
కొలఁదిమీరుట మిగుల గోరమనికాక
॥ఇంతి॥
దేవతాకృపగలిగి దివ్యవైభవములను
భూవలయమున సతులు పుట్టరో మనరో
శ్రీ వేంకటేశుఁడీచెలియకిచ్చిన చనవు-
లేవెలఁదులకు నాతఁడియ్యఁడనికాక
॥ఇంతి॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము