Display:
శృంగార సంకీర్తన
రేకు: 94-3
సంపుటము: 5-376
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: ఆహిరి
నిన్నుఁ గూడిన విభుని నిలువెల్ల సొంపాయ
నిన్నియును నొనగూడె నింతలోపలనె
॥పల్లవి॥
సొలపు నీ కడగంటిచూపు హృదయము గాఁడి
లలినితఁడు శ్రీవత్సలాంఛనుండాయ
వెలఁది నినుఁ బెడఁ బాసి విరహంపుమెయికాఁక -
వలన నీతఁడు నీలవర్ణుఁడైనాఁడు
॥నిన్ను॥
అదన నీ చనుగుబ్బలను చక్రముల చేతఁ
బదిలపరపుచు చక్రపాణియైనాఁడు
సుదతి నీ దేహమున సొబగు కుంకుమపూఁత-
లెదిగి పీతాంబరంబీతనికి నాయ
॥నిన్ను॥
ఆలింగనాపేక్షననయంబు నినుఁగూడ
లోలుఁడటుగాన నాలుగుచేతులాయ
శ్రీలలితమూ ర్తియగు శ్రీ వేంకటేశ్వరుఁడు
పాలించె నిను నీకుఁ బరితోషమాయ
॥నిన్ను॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము