Display:
అధ్యాత్మ సంకీర్తన
రేకు: 42-6
సంపుటము: 1-260
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: పాడి
కడగనుటే సౌఖ్యముగాక యీ-
తడతాఁకుల నెందరు చనరిట్లా
॥కడ॥
నిలిచిన దొకటే నిజమని తెలిసిన
తెలివే ఘన మింతియకాకా
కలకాలము చీఁకటి దవ్వుకొనెడి
వలల భ్రమల నెవ్వరు వడరిట్లా
॥కడ॥
పరహిత మిదియే పరమని తెలిసిన
పరిపక్వమె సంపదగాకా
దురితవిధుల గొందుల సందులఁ బడి
ధరలోపల నెందరు చనరిట్లా
॥కడ॥
ఘనుఁడీ తిరువేంకటపతియని కని
కొనకెక్కుట తేఁకువగాకా
పనిమాలిన యీ పలులంపటముల
తనువు వేఁచు టెంతటి పని యిట్లా
॥కడ॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము