Display:
శృంగార సంకీర్తన
రేకు: 42-1
సంపుటము: 6-1
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: ఆహిరి
చిన్ని శిశువూ చిన్ని శిశువూ
యెన్నఁడుం జూడమమ్మ యిటువంటి శిశువూ
॥పల్లవి॥
తోయపుంగురులతోడఁ దూ గేటి శిరసు, చింత
కాయలవంటి జడలగములతోడ
మ్రోయుచున్న కనకంపు మువ్వల పాదాలతోడ
పాయక యశోదవెంటఁ బాఱాడు శిశువూ
॥చిన్ని॥
ముద్దుల వ్రేళ్లతోడ మొరవంక యుంగరాల
నిద్దపుంజేతుల పైఁడి బొద్దులతోడ
అద్దపుంజెక్కులతోడ నప్పలప్ప లనినంత
గద్దించి యశోద మేనుఁ కౌఁగిలించు శిశువూ
॥చిన్ని॥
బలుపైన పొట్ట మీఁది పాల చాఱల తోడ
నులి వేఁడి వెన్న దిన్న నోరి తోడ
చెలఁగి నేఁడిదె వచ్చి శ్రీ వేంకటాద్రిపై
నిలిచి లోకములెల్ల నిలిపిన శిశువూ
॥చిన్ని॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము