Display:
శృంగార సంకీర్తన
రేకు: 102-1
సంపుటము: 7-7
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: మంగళకౌశిక
ఏల తలవంచుకొనేరిద్దరును నన్నుఁ జూచి
తాలిమి నద్దరిపాటు తగదు నావల్ల
॥పల్లవి॥
ఇక్కడ నీ వేళ చూడనింతి నంపి మఱికాక
గక్కన నేవచ్చినదే కల్ల నావల్ల
మక్కువ నదియుఁగాక మంచముపై సోదించక
మొక్కళానఁ గూచుండుటె మోసము నావల్ల
॥ఏల॥
అందంద మాటలాడే అలబలము చూడక
కందువఁ దెరదీసుటే కల్ల నావల్ల
దిందుపడూరకుండక దీపమెగసన దొబ్బి
ముందు నేనే నవ్వినది మోసము నావల్ల
॥ఏల॥
ఇన్నాళ్ళవలెనె యంటా నీపెకు వరుసియ్యక
కన్నళవిఁ గూడినదె కల్ల నావల్ల
యిన్నిటా శ్రీవేంకటేశ యిఁకనేల నే నిన్న
మొన్ననే రానిదియెల్లా మోసము నావల్ల
॥ఏల॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము