Display:
శృంగార సంకీర్తన
రేకు: 106-6
సంపుటము: 7-36
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: గౌళ
ఓసరించి యేమిటికి నోపినట్టిదానఁ గాను
ఆసల రక్షించు పుణ్యమదే సుమ్మీ యిఁకను
॥పల్లవి॥
ఊరకున్న నన్నుఁదెచ్చి వొకటొకటే నేరిపి
యీరీతినె చనవిచ్చి యింత సేసితి
నేరుపు నేరాలెంచవు నీవు గాచేవాఁడవే
గోరపెట్టి విరహానఁ గుమ్మకుమీ నన్నును
॥ఓస॥
చిన్ననాఁడే నన్నుఁ దెచ్చి సేవలు సేయించుకొని
యిన్నిటాఁ బెద్దరికాన యింత సేసితి
వన్నెలు యెప్పుడు సేసేవే వలపు నే నెరుఁగుదు
వున్నమాయలకు నన్ను వొడ్డకుమీ యిఁకను
॥ఓస॥
మాయింటికి విచ్చేసి మంతనాన నమ్మికిచ్చి
యీ యెడనే నన్నుఁ గూడి యింతసేసితి
పాయపు శ్రీ వేంకటేశ బదికించేదెఱఁగనా
చాయల అపకీర్తికి చాల సుమ్మీ యిఁకను
॥ఓస॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము