Display:
శృంగార సంకీర్తన
రేకు: 107-1
సంపుటము: 7-37
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: మధ్యమావతి
ఏల వేగిరించే వీపె నిట్టె మాటలాడుమని
నాలి నాపె మోముచూచి నవ్వులేఁటికయ్యా
॥పల్లవి॥
వేగినంతా నీ తోడ వెలఁది మాటలాడి
భోగించీ నిద్దురలిదె పొద్దెక్కినంతా
చేగదేరినట్టి పెక్కుచింతలు గలవాఁడవు
యీగతి నిద్దురలు నీకేల వచ్చీనయ్యా
॥ఏల॥
పెక్కుదడవు నీతోడఁ బెనఁగినది గనక
వుక్కుననలసి కొంత వూరకున్నది
అక్కడ సాములు చేసే యలవాటు గలవాఁడ
విక్కడ నీ కింతయలపేల వచ్చె(చ్చీ?) నయ్యా
॥ఏల॥
తతిగొన్న నీరతులఁ దనిసినది గనుక
మతిపరవశముల మఱచున్నది
యితవై శ్రీ వేంకటేశ యీపెఁ గూడితివి నీకు
నితరకాంతలవలె నేలవుండీనయ్యా
॥ఏల॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము