అధ్యాత్మ సంకీర్తన
రేకు: 5-1
సంపుటము: 1-29
రేకు: 5-1
సంపుటము: 1-29
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: ఆహిరి
పెంచఁ బెంచ మీఁదఁ బెరిగేటి చెలిమి ఇంచుకంత తాలిముల కెడలేని చెలిమి | ॥పెంచ॥ |
అంటుముట్టు లేక మనసు లంటుకొన్న చెలిమి కంటఁ గంట నవ్వించే ఘనమైనచెలిమి వెంట వెంటఁ దిరిగాడు వెఱ్ఱిగొన్న చెలిమి యింటివారి చిత్తములకు నెడరైన చెలిమి | ॥పెంచ॥ |
చెక్కుచెమట పెక్కు [1]వలనే చిక్కనైన చెలిమి యెక్కడౌటా తమ్ముఁ దమ్ము [2]నెఱఁగనీని చెలిమి చక్కఁదనమే చిక్క మేను చిక్కినట్టి చెలిమి లెక్కలేని యాసలెల్ల లేఁతలయిన చెలిమి | ॥పెంచ॥ |
అంకురించినట్టి తలఁపు లధికమయిన చెలిమి లంకెలయిన యాసలెల్లా లావుకొన్న చెలిమి వేంకటాద్రివిభునిఁ గూడి వేడుకయిన చెలిమి పంకజాననలకెల్లఁ బాయరాని చెలిమి | ॥పెంచ॥ |
[1] ‘వలెనే’ పూ.ము.పా.
[2] ‘నెఱుఁగని నీ చెలిమి’ పూ.ము.పా.