శృంగార సంకీర్తన
రేకు: 150-3
సంపుటము: 7-293
రేకు: 150-3
సంపుటము: 7-293
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: వరాళి
ఎరఁగను కపటాలు యెరిఁగి మరతురా చిరుత పాయముదాన చిత్తము నీకెట్టిదో | ॥పల్లవి॥ |
మలసి కోపింతుఁగాని మాటాడకుండలేరా అలసి జంకింతుఁగాని అలుగలేరా తలఁపె తెగుదు గాని దగ్గరకుండఁగలేరా సిలుగు నామోహమిది చిత్తము నీకెట్టిదో | ॥ఎరఁగ॥ |
నేరములె యెంతుఁగాని నిన్ను మెచ్చకుండలేరా దూరి పలుకుదుఁగాని తొలఁగలేరా ఆరసి మొక్కుదుఁగాని అవ్వలిమోము గాలేరా చేరిన నాభావమిది చిత్తము నీకెట్టిదో | ॥ఎరఁగ॥ |
పచ్చిగా నవ్వుదుఁగాని పంతమియ్యకుండలేరా గచ్చుల నీవంటితే నే కాదనలేరా నిచ్చలు శ్రీవేంకటేశ నిన్నుఁ గూడితినిదే చెచ్చెర నాగుణమిది చిత్తము నీకెట్టిదో | ॥ఎరఁగ॥ |