శృంగార సంకీర్తన
రేకు: 193-1
సంపుటము: 7-549
రేకు: 193-1
సంపుటము: 7-549
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: కేదారగౌళ
వొడఁబరచఁగ నేలే వొద్దే యిఁక కడునైతే చవిగాదు కానరాదా మీకు | ॥పల్లవి॥ |
చలము లేకున్నఁ జాలుసంతోసమే పనులెల్ల చెలిమికత్తెలు మీరు చెప్పరే బుద్ధి తలఁపు లేశములైతే తనమాటె నామాట తెలుసునో తెలియదో దిష్టిములిందరికి | ॥వొడ॥ |
వేసట లేకున్నఁ జాలు వేడుకలే పొందులెల్ల గాసిఁబెట్టి యిఁకనట్టే కానీ లేరే ఆసలు గలిగితే అన్నిటాఁ దానే నేను యీసుగద్దొలేదొ మీరె యెంచుకొరే యిందును | ॥వొడ॥ |
యెఱుక గలిగితేఁ జాలు యియ్యకోరె వలపెల్ల మఱఁగులు వాపితిరి మంచిదాయనే మఱి శ్రీ వెంకటేశుఁడు మన్నించి యిటు గూడె గుఱిగా మీమనసులఁ గోరినట్టే ఆయనే | ॥వొడ॥ |