Display:
శృంగార సంకీర్తన
రేకు: 201-1
సంపుటము: 8-1
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: మధ్యమావతి
తెగని పనులకు నింతేసి యాలే
మొగమోటతోడివి మోహములెల్లను
॥పల్లవి॥
అలిగిన విభుఁడు నిన్నట్టె వేడుకొనవచ్చె
చలమో ఫలమో సతి నీకు
వెలలేని కోపములు వేగినంతాఁ జేసినాను
కలయక మానేరా కాఁకలెల్లఁ దీరను
॥తెగని॥
తతి మాటాడనివాఁడు తానే సరసములాడీ
వ్రతమో యితవో వనిత నీకు
మతకాన మీరెంత మారుమోములై యుండిన
రతిఁ గూడకుండేరా రచనలతోడను
॥తెగని॥
యేడోవున్న శ్రీవేంకటేశుఁడే యింటికి వచ్చె
ఆడికో వాడికో అంగన నీకు
పాడి పంతములతోడ బలుములెంత చూపిన
వీడెమిచ్చి కూడితిరి వేరులయ్యేరా
॥తెగని॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము