అధ్యాత్మ సంకీర్తన
రేకు: 66-2
సంపుటము: 1-341
రేకు: 66-2
సంపుటము: 1-341
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: ఆహిరి
సతతము నేఁ జేయు ననాచారములకుఁ గడ యెక్కడ మతి ననుఁ గని కావుము రామా రామా రామా | ॥సతతము॥ |
[1]సేసిన నా బ్రహ్మహత్యలు శిశుహత్యలు గోహత్యలు ఆసలనెన్నో యెన్నో ఆయాజాడలను యీసున నేనిపు డెరిఁగియు నెరఁగక సేసే దురితపు రాసులకును గడలే దిదె రామా రామా రామా | ॥సతతము॥ |
నమలెడి నా వాచవులకు నానావిధభక్షణములు కమిలిన దుర్గంధపు శాకమ్ములు దొమ్ములును జముబాధల నరకంబుల సారెకు నన్నెటువలె శ్రీ- రమణుఁడ ననుఁ గాచే విటు రామా రామా రామా | ॥సతతము॥ |
కపటపు నా ధనవాంఛలు కలకాలముఁ బరకాంతలఁ జపలపుఁ దలఁపుల[2] సేఁత లసంఖ్యము లరయఁగను యెపుడును నిటువలెనుండెడు హీనుని నన్నెటు గాచెదో రపమున శ్రీవేంకటగిరి రామా రామా రామా | ॥సతతము॥ |
[1] ‘నా సేసిన బ్రహ్మహత్యలు’ అనుట సహజము.
[2] ‘సఖ్యము’ కావచ్చు.