అధ్యాత్మ సంకీర్తన
రేకు: 66-4
సంపుటము: 1-343
రేకు: 66-4
సంపుటము: 1-343
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: సామంతం
చాలదా బ్రహ్మమిది సంకీర్తనం మీకు జాలెల్ల నడఁగించు సంకీర్తనం | ॥చాలదా॥ |
సంతోషకరమైన సంకీర్తనం సంతాప మణఁగించు సంకీర్తనం[1] జంతువుల రక్షించు సంకీర్తనం సంతతముఁ దలచుఁ డీసంకీర్తనం | ॥చాలదా॥ |
సామజముఁ గాంచినది సంకీర్తనం సామమున కెక్కు డీసంకీర్తనం సామీప్య మిందరికి సంకీర్తనం సామాన్యమా విష్ణుసంకీర్తనం | ॥చాలదా॥ |
జముబారి విడిపించు సంకీర్తనం సమబుద్ధి వొడమించు సంకీర్తనం జమళి సౌఖ్యములిచ్చు సంకీర్తనం శమదమాదులఁ జేయు సంకీర్తనం | ॥చాలదా॥ |
జలజాసనుని నోరి సంకీర్తనం చలిగొండసుత దలఁచు సంకీర్తనం చలువ గడు నాలుకకు సంకీర్తనం చలపట్టి తలఁచుఁ డీసంకీర్తనం | ॥చాలదా॥ |
సరవి సంపదలిచ్చు సంకీర్తనం సరిలేని దిదియపో సంకీర్తనం సరుస వేంకటవిభుని సంకీర్తనం సరుగననుఁ దలఁచుఁ డీసంకీర్తనం | ॥చాలదా॥ |
[1] (నిడురేకు 91) రెండవ మూఁడవపాదములు వ్యత్యస్తములు.