అధ్యాత్మ సంకీర్తన
రేకు: 66-6
సంపుటము: 1-345
రేకు: 66-6
సంపుటము: 1-345
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: శుద్ధవసంతం
ఏమి వొరలేరు యేమి మరలేరు యీ మాయలంపటం బీఁద మోఁదనే[1] కాని | ॥ఏమి॥ |
సతులుగల మేలు దా సడిఁ బొరలనె కాని సతమైన సౌఖ్యస్వస్థానంబు లేదు హితులుగల మేలు తా నిడుమఁ బొరలనె కాని హితవివేకము నరుల కెంతైన లేదు | ॥ఏమి॥ |
తనువులెత్తిన మేలు తగులాయమే కాని కనుఁగొనఁగ యోగభోగము గొంత లేదు ఘనముగల మేలు తా గర్వాంధమే కాని ఘనుఁడైన శ్రీనాథుఁ గనుగొనగ లేదు | ॥ఏమి॥ |
చింతగలిగిన మేలు చివుకఁబట్టనె కాని చింత వేంకటవిభునిఁ జింతించ లేదు సంతుగలిగిన మేలు సంసారమే కాని సంతతముఁ జెడని సద్గతిఁ జేర లేదు | ॥ఏమి॥ |
[1] ‘ఈఁత-మోఁత’ అని అన్నమయ్య అలవాటు. ఇక్కడ ‘ఈఁదుట-మోఁదుట’ కావున రెండవపదములో ‘మోయుట’ కాక ‘మోఁదుట’ కావలసివచ్చినది.