Display:
శృంగార సంకీర్తన
రేకు: 251-1
సంపుటము: 9-1
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: దేసాక్షి
దగ్గరితె మొగచాటు దువ్వుల నుంటేఁ జవి
నిగ్గుల యీరెండూను నీవొళ్లనే కంటినే
॥పల్లవి॥
చెలియ పతిఁ గానక చింతతో నుండి ఆతఁడే
పిలువఁగా యిప్పుడైతే బిగిసేవే
కలయ నంటా దూరి గక్కనఁ జెయి వట్టితే
మొలకనవ్వులతోడ ములిగేవే
॥దగ్గ॥
అప్పుడైతే యెడమాట లాడించి నాయకుఁడు
తప్పక చూచితే నిట్టె తల వంచేవే
వుప్పతించి దూరఁగగానె వొద్దఁ గూచుండి నాతఁడు
పిప్పిగట్టే సిగ్గులతోఁ బెనఁగేవే
॥దగ్గ॥
చిత్తములోఁ గోరినట్టి శ్రీవెంకటేశ్వరుఁడు
అత్తి నిన్నుఁ గూడితేనె అలసేవే
పొత్తుల మోవితేనెతీపుల సోకించె నితఁడు
బత్తి సేయఁగా నీవు భ్రమసేవే
॥దగ్గ॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము