Display:
శృంగార సంకీర్తన
రేకు: 278-2
సంపుటము: 9-164
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: శ్రీరాగం
వరుసతోనె వచ్చితే వలపులు చవులౌను
అరమరచి విభుఁడు అందేమి సేసీనె
॥పల్లవి॥
మనసులో కాంక్షకు మాటాడితేఁ గొంతాస
ననిచినమీఁద మరి నవ్వులింపౌను
చనవుగలిగితేను సరసమాడఁ జెల్లును
పెనఁగేపాటిచేఁతల ప్రియము లీడేరును
॥వరు॥
కాయముమీఁది తమికి కనుచూపు గొంతాస
చేయి చేయిఁ గదిసితే సిగ్గులొంటును
ఆయములు గరఁగితే నందిపొందికలు దగు
తోయరాని మొగమోట తుదలుమీరించును
॥వరు॥
అట్టె పాయపుమదాల కండనుండాఁ గొంతాస
జట్టిగొన్నయందుమీఁద సన్నలుమేలు
అట్టె శ్రీవెంకటేశుండు అలమేల్మంగను నేఁ
బట్టితి ననుచుఁ గూడెఁ బనులెల్లా దక్కును
॥వరు॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము