Display:
శృంగార సంకీర్తన
రేకు: 8-3
సంపుటము: 10-44
తాళ్లపాక చినతిరుమలాచార్య
రాగము: పాడి
ఆతఁ డేమి దవ్వుగాఁడు అతివ ప్రాణనాథుఁడె
నీతితోడ వానిఁ గూర్చి నెలఁతఁ గావఁగదరే
॥పల్లవి॥
చల్లనైన గాలిచేత జాలిరేఁచె వలపు
పిల్లఁగోవి వట్టె వాఁడు పెచ్చురేఁచెనే
పొల్లవోని పూవులపప్పొడి పోదిసేసెనే
వొల్లనన్నఁ బోదు దీని కోమరమ్మ చెలులు
॥ఆతడే॥
రవ్వలైన వెన్నెలల రాఁపాయ మోహము
నవ్వి నవ్వి వాని చూపు నామురేఁచెనే
కొవ్వినట్టి కోవిలలకూఁతచేఁత గనమాయ
యెవ్వ రేమి సేతు రిఁక యెదరమ్మ దీనిని
॥ఆతడే॥
మదను పూవుటమ్ము సోఁకి మదము రేఁగె ప్రేమము
కదిసి విభుఁడు మోము చూపి కళలు రేఁచెనే
యిదివో శ్రీవెంకటనాథుఁ డింతి నిట్టె కూడినాఁడు
చెదరనట్టి వేడుకెల్ల చెందెనమ్మ యింతికి
॥ఆతడే॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము