Display:
శృంగార సంకీర్తన
రేకు: 9-3
సంపుటము: 10-50
తాళ్లపాక చినతిరుమలాచార్య
రాగము: బౌళి
నీ వేమి సేతు వాపె నిన్నుఁ బెరరేఁచగాను
తావుల సాకిరి గోరఁ దగదా నిన్నును
॥పల్లవి॥
పోరాడే వాపెకుఁగా వూనుక నీవు రాఁగా
మేరతోఁ జుట్టా లెల్లా మెచ్చకుండేరా
సారె సారెఁ బిరిదూరి సాకిరులు చెప్పఁగాను
తీరిచేటి చెలు లెల్ల దీవించకుందురా
॥నీవేమి॥
కన్నుగీఁ టాపెకు నాకుఁ గై లాటాలు వెట్టఁగాను
కన్న విన్న వారెల్లాఁ బొగడకుండేరా
మన్నించి యాపెకు నీవు మాఁట లందియియ్యఁగాను
సన్నల వాడవారెల్లా సంతసించకుందురా
॥నీవేమి॥
సందడి జగడాలలో సారె నన్నుఁ బట్టఁగాను
అందరును నిన్నె మేలనకుండేరా
అంది శ్రీవెంకటనాథ ఆపెను నన్నుఁ గూడితి
విందురు నీచేఁత లివి యెంచకుండేరా.
॥నీవేమి॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము