Display:
శృంగార సంకీర్తన
రేకు: 10-1
సంపుటము: 10-54
తాళ్లపాక చినతిరుమలాచార్య
రాగము: మాళవిగౌళ
మంచితనము లదెట్టు మరచీనయ్యా
మంచముపై నున్న నెట్టు మరచీనయ్యా
॥పల్లవి॥
యెచ్చరించి వొక రొక రెనసి కూడుండేటి
మచ్చికలు చెలి యెట్టు మరచీనయ్యా
వచ్చినదాఁకాఁ దలవాకిటనె కాచుకుండే
మచ్చులచేఁత ల దెట్టు మరచీనయ్యా
॥మంచి॥
యిత వెరిఁ గొక రొక రిచ్చకాలు సేసేది
మతిలోనఁ జెలి యెట్టు మరచీనయ్యా
సతతము నొండొరుల జవ్వనమె కుదువైన
మతములు చెలి యెట్టు మరచీనయ్యా
॥మంచి॥
సంతసాన మనసులే సరిదాఁకినట్టి నీ
మంతనాలు చెలి యెట్టు మరచీనయ్యా
కాంతను నీవె శ్రీవెంకటనాథ కూఁడగాను
మంతు కెక్కె నిది యెట్టు మరచీనయ్యా
॥మంచి॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము