Display:
శృంగార సంకీర్తన
రేకు: 10-2
సంపుటము: 10-55
తాళ్లపాక చినతిరుమలాచార్య
రాగము: భైరవి
తనువె యిక్కడఁ గాని తలఁపెల్లా నక్కడనె
మనసులో నాపె నింక మాననైనఁ గలవా
॥పల్లవి॥
మాయింటాడ నిచ్చకపు మాఁటలాడే వింతే కాక
వోయీ నీ వాసెఁ బాసి వుండ నోపేవా
ఆయెలే మాముందటను అసము దించవు గాక
చేయూర నీవె యాపెను చెనక కుండేవా
॥తనువె॥
మానలేనివానివలె మన సరసేవు గాక
ఔనా ఆపె వడ్డించ కారగించేవా
తేనెలమాఁటఁల దరితీపులు సేసేవు గాక
కానీలె యాపెపై తమకమె పట్టెఁగలవా
॥తనువె॥
యీపొద్దుకు నాకాఁగిలి యింపాయ ననేవు గాక
పో పో నీవాపెఁ దలపోయ కుండేవా
కాపాడి నన్నును శ్రీవెంకటనాథ కూడితివి
మాపొందు లాసెవద్దను మఱవఁగఁ గలవా
॥తనువె॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము