Display:
శృంగార సంకీర్తన
రేకు: 10-4
సంపుటము: 10-57
తాళ్లపాక చినతిరుమలాచార్య
రాగము: నాదరామక్రియ
వేగిరమా నీవు విభుఁడవు నీ వెలఁదిని నేను
సోగకన్నుల నీసొలపుఁ జూపుల సొంపు నాకుఁ జాలదా
॥పల్లవి॥
చెలియ మునుపు సింగారించుకొన్న చెంగావిచీర యిది నీవు
తలఁకక నేడు దట్టిగట్టుకొంటె దాని కేమిదోసమా
అలిగేనా నేను అందుండె మాఁటాడు అంటుకొన నోపను అది
తలఁగ వేరొక్క తావునఁ బెట్టిరా దగ్గరుందు గాకి
॥వేగి॥
కందువతో నాపె కస్తూరి వూయఁగ గట్టిబేఁటులు రాలితే నీవు
పొందు చెడకుండ బొట్టు వెట్టుకొంటె బోగానకుఁ గడమా
నింద నిన్నాడేనా నేటి కటుండరా నే నందు కోరువనువొక
చందానఁ బన్నీట జలక మాడి నాసంగడికి రారా
॥వేగి॥
ముద్దియ వేలనె ముందర నుండెటి ముద్దురవుంగరమునీవు
పెద్దరికానకు ప్రియమునఁ గేల బెట్టుకొంటేఁ దగదా
గద్దరివై శ్రీవెంకటనాథ నన్నుఁ గరఁగించి కూడితి నా
వద్దనె పాయక వాలాయించి దేవరవలె నుండరా.
॥వేగి॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము