Display:
అధ్యాత్మ సంకీర్తన
రేకు: 6-6
సంపుటము: 1-41
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: శంకరాభరణం
తలపోఁత [1]బాఁతె తలఁపులకుఁ దమ
కొలఁ దెఱంగని మతి గోడాడఁగా
॥తల॥
ఆపదలు బాఁతె అందరికినిఁ దమ
చాపలపు సంపదలు సడిఁ బెట్టఁగా
పాపములు బాఁతె ప్రాణులకును మతిఁ
బాపరాని యాస దమ్ముఁ బాధించఁగా
॥తల॥
జగడాలు బాఁతె జనులకునుఁ దమ
పగలైన కోపాలు పైకొనఁగా
వగలు బాఁతె వలలఁ బెట్టెడి తమ్ముఁ
దగిలించు మమత వేదనము సేయఁగా
॥తల॥
భయములు బాఁతె పరులకును తమ
దయలేక అలయించు ధనముండఁగా
జయములు బాఁతె సతతమును యింత
నయగారి వేంకటనాథుఁ డుండఁగాను
॥తల॥

[1] ‘బ్రాఁతె’ అని పూ.ము.పా. రేకునందంతటా ‘బాఁతే’ గలదు. ఈ వాఙ్మయమునందంతటను ఈ పద మిటే రేకులలో నున్నది.
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము