శృంగార సంకీర్తన
రేకు: 333-2
సంపుటము: 11-194
రేకు: 333-2
సంపుటము: 11-194
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: బౌళిరామక్రియ
అద్దో మానవుగా అదేమే నీవు గద్దించి నీవు చూచితే కాళ్లు వణఁకీనా | ॥పల్లవి॥ |
మచ్చిక నాతఁడు నేడు మా యింటికి వచ్చె నంటా పచ్చి గొంతా వెచ్చి గొంతాఁ బలికే వేమే బచ్చెనల నతఁడు నీ సాంగెములో వాఁడై నెచ్చెలి నీకుఁ గొంకితే నే నీకు వెరతునా | ॥అద్దో॥ |
చెప్పి యిందరిలో వాఁడు చేయి నాపై వేసె నంటా అప్పటనుండి వుడికే వ దేమే నీవు దెప్పర మాతఁడు నీచేఁ దిట్టించుకొనుఁ గాక నిప్పువంటిదాన నేను నీచేతఁ బడేనా | ॥అద్దో॥ |
గక్కన శ్రీవెంకటాద్రిఘనుఁడు నన్నుఁ గూడితే పక్కన నాతనిఁ గొంగు వట్టే వేమే చక్క నీ వండ నుంటె సాదించఁ జెల్లుఁ గాక యిక్కడ వచ్చే మనేవే యిక నే నోరుతునా | ॥అద్దో॥ |