Display:
శృంగార సంకీర్తన
రేకు: 333-6
సంపుటము: 11-198
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: నాదరామక్రియ
కలఁడుగా యిటువంటి గడుసరి భూమిమీఁద
తెలిసితి మిన్నాళ్లకు దిష్టముగ వీనిని
॥పల్లవి॥
తగని వెల్లాఁ జేసీ తనమాఁటె ఘనము
జిగి నా మొగము చూచీ సిగ్గు వడఁడు
నగువారి నెరఁగఁడు నాపై నానలు వెట్టీ
యెగసక్కీఁడు వీని దెంత నేరుపే
॥కలడుగా॥
తప్పుజగడాలు రేఁచీ తానె మంచివాఁడు
యిప్పుడె వావులు చెప్పీ యెవగించఁడు
ముప్పిరిఁ దల వంచిన మోవితేనె లియ్య వచ్చీ
చప్పుడు గాకుండాఁ జేరీ జాణ గదే వీఁడు
॥కలడుగా॥
తమకించు నిన్నటాను తగవరీఁ దానె
అమరఁ గతలు చెప్పీ నందు కాతఁడు
తిమిరి శ్రీవెంకటాద్రి దేవుఁ డిట్టె నన్నుఁ గూడె
సమరతి నిన్నిటాను సరుసుఁడు గదవే
॥కలడుగా॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము