Display:
అధ్యాత్మ సంకీర్తన
రేకు: 7-4
సంపుటము: 1-45
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: లలిత
మంచిదివో సంసారము మదమత్సరములు మానిన
కంచునుఁ బెంచును నొకసరి [1]గాఁ దా చూచినను
॥మంచిది॥
ఆపదలకు సంపదలకు నభిమానింపక యుండిన
పాపముఁ బుణ్యము సంకల్పములని తెలిసినను
కోపము శాంతము తమతమ గుణములుగా భావించిన
తాపము శైత్యమునకుఁ దాఁ దడఁబడకుండినను
॥మంచిది॥
వెలియును లోపలయును నొకవిధమై హృదయం బుండిన
పలుకునుఁ బంతము దా నొక భావన దోఁచినను
తలఁపునఁ దిరువేంకటగిరిదైవము నెలకొని యుండిన
సొలపక యిన్నిటికినిఁ దా [2]సోఁకోరుచెనైనా
॥మంచిది॥

[1] ‘గాదా చూచినను’ అని రేకు.

[2] సోఁకు ఓరుచుటచేతనైనా అని అర్థము కాబోలు.
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము