Display:
శృంగార సంకీర్తన
రేకు: 376-3
సంపుటము: 11-453
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: సామంతం
ఎఱఁగ ననకుండా నీ కెఱిఁగించితిమి నేఁడు
తఱవాతి పనులకు తలఁపు నీ కెట్టిదో
॥పల్లవి॥
జక్కవకుచములపై జారెటి పయ్యదతోడ
చెక్కుల జారే చెమటచిత్తడితోడ
నిక్కి నిక్కి లోలోనె నీ కెదురు చూచుకొంటా
అక్కడ నున్నది చెలి ఆనతి నీ దెట్టిదో
॥ఎఱఁగ॥
నిట్టూరుపుగములతో నివ్వెరగుపాటుతోడ
అట్టె నిన్నుఁ గూడెటి యాసలతోడ
నెట్టనఁ దనపాయము నీకే మీఁ దెత్తుకొంటా
యిట్టె వాకిటికి వచ్చె యెన్నికె నీ కెట్టిదో
॥ఎఱఁగ॥
బారపుఁదురుముతోడఁ బవళించే నీపానుపు
చేరి యం దున్నది నవ్వునెలవితోడ
ఆరయ శ్రీవెంకటేశ అంతలో నేతెంచి యాపె
నూరడించి కూడితివి వున్న దిఁక నెట్టిదో
॥ఎఱఁగ॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము