Display:
శృంగార సంకీర్తన
రేకు: 376-4
సంపుటము: 11-454
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: ముఖారి
ఇంక నేల తెగి కొంక నెదురా నేనూ । నీవు ।
కంకిగా నేమి సేసినాఁ గా దనేనా నేను
॥పల్లవి॥
మక్కువ నీవే నన్ను మన్నించఁగా నింతే కాక
యెక్కడ నీసతులలో నెవ్వతె నేను
మొక్కలపుఁజేఁత లేల మొగమాట మరి యేల
వక్కణించి నీ వే మన్న వద్దనేనా నేను
॥ఇంకనేల॥
నీ విచ్చినచనువున నేనే కసరితిఁ గాక
యీవల నీ వూడిగాన కేబాఁతి నేను
ఆవలఁ గపట మేల అట్టె కూటము లేల
నీవలసిన ట్టుండఁగా నిందించేనా నేను
॥ఇంక నేల॥
కామించి నీవే నన్నుఁ గలయఁగా నింతే కాక
యేమంచిదాన నీకు యిప్పుడే నేను
ఆముక శ్రీవెంకటేశ అట్టె నన్నుఁ గూడితివి
ప్రేమము నీవు నించఁగా బిగిసేనా నేనూ
॥ఇంక నేల॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము