Display:
అధ్యాత్మ సంకీర్తన
రేకు: 7-6
సంపుటము: 1-47
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: సామంతం
పాయని [1]కర్మంబులె కడుబలవంతము లనినప్పుడె
కాయమునకు జీవునకునుఁ [2]గర్తృత్వము లేదు
॥పాయని॥
ఆతుమ సకలవ్యాపకమని తలపోసిన పిమ్మట
జాతియుఁ గులాభిమానముఁ జర్చింపనె రాదు
భూతవికారములన్నియుఁ బురుషోత్తముఁ డనినప్పుడు
పాతకముల పుణ్యంబుల పని తనకే లేదు
॥పాయని॥
పదిలంబుగ సర్వాత్మకభావము దలఁచిన పిమ్మట
ముదమున నెవ్వరిఁ జూచినఁ మొక్కక పోరాదు
కదిసిన యిప్పటి సుఖములె కడుదుఃఖములని తెలిసిన
చెదరక సంసారమునకు జేసాఁపనె రాదు
॥పాయని॥
పరిపూర్ణుఁడు తిరువేంకటపతియనఁగా వినినప్పుడు
యెరవుల హీనాధికములు యెగ్గులు మరి లేవు
పరమాత్ముండగు నీతని భక్తులం దలఁచిన యప్పుడు
తిరముగ నీతనికంటెను దేవుఁడు మరి లేఁడు
॥పాయని॥

[1] ‘కర్మఁబులె’ అని రేకు. ‘కర్మములే’ అని పూ.ము.పా.

[2] ‘గర్తత్వము’ అని రేకు.
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము