Display:
శృంగార సంకీర్తన
రేకు: 418-4
సంపుటము: 12-106
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: శ్రీరాగం
రతిరాజగురుఁడవు రమణిని నే నీకు
ఇతరము లెల్లాను యేమి చెప్పేమయ్యా
॥పల్లవి॥
వరుసల నీ చిత్తము వచ్చినదే కాఁపురము
అరసి నిన్నుఁ బాయని దది బదుకు
సరసము నీతో నాడే చనవే సౌఖ్యము
యెరవుల సుద్దు లిఁక సేమి చెప్పేమయ్యా
॥॥
నెలవి నీవు నవ్విన చెలువమె సఫలము
అలరి నీవు మాటాడుటది సంపద
తలఁచి నీకు వలచు దాని జన్మమే జన్మము
యెలమి నున్న కోరికె లేమి చెప్పేమయ్యా
॥॥
భావించి నీవు చూచిన భాగ్యమే యెక్కుడు
తావుకొన్న నీ రతులే ధనధాన్యాలు
శ్రీ వేంకటేశ్వర నే నీదేవి నలమేల్మంగను
యీవేళ నేలితి వింక నేమి చెప్పేమయ్యా.
॥॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము