Display:
శృంగార సంకీర్తన
రేకు: 422-4
సంపుటము: 12-130
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: ఆహిరి
యేలే పొగిలేవే యిప్పు డింతిరో నీవు
వాలాయించి నీ విభుఁడు వచ్చి కూడీఁ గాక
॥పల్లవి॥
కడుఁ దమకముతోడఁ గాచుకున్నకాంతను
సడిఁ బెట్టి యేఁపునా సరఁసుడు
జడియక మోవితేనె చవిచూపి చెక్కు నొక్కి
బడలిక లెల్లాఁ దీర్చి పచారించుఁగాక
॥॥
ఆసల నెదురుచూచి అండకు వచ్చినదాని
గాసిలఁ గాఁక రేఁచునా కాంతుఁడు
వేసరక నవ్వు నవ్వి వెడసిగ్గులు దేర్చి
రాసికెక్కఁ జన విచ్చి రక్షించుఁ గాక
॥॥
మించి వుర మెక్కి యలమేలుమంగవైన నిన్ను
వంచించునా శ్రీ వేంకట వల్లభుఁడు
పొంచి కౌఁగిలించుకొని భోగపు రతుల నించి
యెంచరాని నీతలఁపు లీడేర్చుఁ గాకా
॥॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము