Display:
అధ్యాత్మ సంకీర్తన
రేకు: 8-3
సంపుటము: 1-51
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: ముఖారి
నదు లొల్లవు నా స్నానము కడు-
సదరము నాకీ స్నానము
॥నదు॥
ఇరువంకల [1]నీ యేచిన ముద్రలు
ధరియించుటే నా స్నానము
ధరపై నీ నిజదాసుల దాసుల
చరణధూళి నా స్నానము
॥నదు॥
తలఁపులోన నినుఁ దలఁచినవారలఁ
దలఁచుటే నా స్నానము
వలనుగ నినుఁ గనువారల శ్రీపాద-
జలములే నా స్నానము
॥నదు॥
పరమభాగవతపాదాంబుజముల
దరుశనమే నా స్నానము
తిరువేంకటగిరిదేవ నీ కథా-
స్మరణమే నా స్నానము
॥నదు॥

[1] ‘నీవేచిన’ అని పూ.ము.పా.
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము